మే 7న అక్షయ తృతీయ…దిగొచ్చిన పసిడి

201
gold rate

అక్షయ తృతీయ(మే 7)కు టైం దగ్గర పడింది.ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు  బంగారం కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో పసిడి ధర ఆకాశాన్నంటుతుంది.అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త.

పసిడి ధరలు దిగొచ్చాయి. ఫిబ్రవరి నెలలోని గరిష్ట స్ధాయి నుండి చూస్తే ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 7 శాతం పడిపోయింది. ఫిబ్రవరిలో తులం బంగారం ధర రూ. 34,830 ఉండగా మే 2న ధర రూ.32,470 స్థాయికి పడిపోయింది. అంటే బంగారం ధర రూ.2,360 క్షీణించింది.

మరోవైపు అక్షయ తృతీయ నేపథ్యంలో బంగారం దిగుమతులు జోరందుకున్నాయి. మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు 20 శాతం పెరుగుదలతో 196.8 టన్నులకు చేరాయి. అక్షయ తృతీయ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరగొచ్చని జువెలర్లు విశ్వాసంతో ఉన్నారు.

అయితే,రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో పసిడి పరుగులు పెట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు.