సమాజ్‌వాదీ పార్టీలో వర్గపోరు మరింత ముదురుతోంది. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వచ్చారు. పార్టీలో పరిస్థితులపై చర్చించేందుకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ములాయం సింగ్ ఈరోజు సమావేశం ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభానికి ముందు ఎస్పీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ మద్దతుదారులు, తిరుగుబాటు దారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.
మరోవైపు సమాజ్ వాది పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ములాయంతో పాటు అఖిలేష్,అమర్ సింగ్,శివపాల్ యాదవ్ కీలక నేతలు హాజరయ్యారు. సమాజ్ వాది పార్టీ చీలిక దిశగా వెళుతోందన్న సంకేతాల నేపథ్యంలో అఖిలేష్ మౌనం వీడారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని…ములాయం నా గురువు..మార్గదర్శని స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన వారు ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అమర్ సింగ్‌పై మండిపడ్డారు.
లక్నోలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. అఖిలేశ్ ముఖ్యమంత్రి కాదని అమర్ సింగ్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనపై చర్య తీసుకున్నారని వాపోయారు.నేతాజీ(ములాయం సింగ్ యాదవ్) కోరితే సీఎం పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్ధమని ప్రకటించారు.ములాయం కోరితేనే ప్రజాపతిని మంత్రి పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు.