ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల విషయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభకు మూడో అభ్యర్థిని బరిలోకి దించకుండా ఎస్పీ కేవలం ఇద్దరినే పోటీకి నిలిపింది. మరోవైపు బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం పది స్థానాలకు పది మంది అభ్యర్థులే ఉండటంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. పోటీ లేకుండానే ఇరు పార్టీలకు తమ వాటా దక్కే పరిస్థితి ఏర్పడింది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. మూడో అభ్యర్థిని నిలబెట్టకపోవడం అఖిలేశ్ యాదవ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేల్లో క్రాస్ ఓటింగ్ జరిగి అంతర్గత విభేదాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు ఎస్పీ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఎస్పీ మూడో అభ్యర్థిని బరిలోకి దించి ఉంటే రాజ్యసభ ఎన్నిక అనివార్యమయ్యేది. అప్పుడు కొందరు ఎస్పీ ఎమ్మెల్యేలు ఎన్డీఏకు అనుకూలంగా ఓటు వేస్తే అది బహిరంగంగా బయటపడే అవకాశం ఉండేది. దీంతో పార్టీపై, నాయకత్వంపై విమర్శలు పెరగడంతో పాటు కార్యకర్తల స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉండేది.
అంతేకాకుండా 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చల్లో కూడా ఎస్పీ బలహీనంగా కనిపించే అవకాశం ఉండేది. అందుకే అదనపు రాజ్యసభ సీటు కోసం అనిశ్చిత పోరాటం కంటే పార్టీ అంతర్గత ఐక్యత, సంస్థాగత స్థిరత్వానికే అఖిలేశ్ ప్రాధాన్యం ఇచ్చినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
2024 ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం బీజేపీ ఏడు, ఎస్పీ మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ అనూహ్యంగా ఎనిమిదో అభ్యర్థిని బరిలోకి దించి ఎన్నికను తప్పనిసరి చేసింది.చివరకు బీజేపీకి చెందిన మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు విజయం సాధించగా.. ఎస్పీ నుంచి కేవలం ఇద్దరే గెలిచారు. సుమారు ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయడం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 396 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 396 మంది ఎమ్మెల్యేలు, 10 స్థానాల లెక్కన 396ని 11తో భాగిస్తే 36 వస్తుంది. దానికి ఒక ఓటు కలిపితే ఒక్క స్థానానికి 37 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం.రాజ్యసభ ఎన్నికల్లో సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ విధానం అమల్లో ఉంటుంది. ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మొదటి, రెండో, మూడో ప్రాధాన్యతలను నమోదు చేస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో అన్ని స్థానాలు భర్తీ కాకపోతే, ఇప్పటికే ఎన్నికైన అభ్యర్థులకు వచ్చిన అదనపు ఓట్లను రెండో ప్రాధాన్యత అభ్యర్థులకు బదిలీ చేస్తారు.
ఎస్పీ, కాంగ్రెస్‌కు కలిపి అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఒక ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ జైలులో ఉండటంతో ఆయన ఓటు వేయలేకపోతే ఈ సంఖ్య 102కు తగ్గుతుంది. పూజా పాల్, రాకేశ్ పాండే, వినోద్ చతుర్వేది, ఆశుతోష్ మౌర్య వంటి నలుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు ఎన్డీఏకు మద్దతు ఇస్తారని అంచనాలు ఉండటంతో కూటమి విశ్వసనీయ బలం మరింత తగ్గవచ్చు. మరోవైపు ఎస్బీఎస్పీ, ఆర్ఎల్డీకి చెందిన నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలు ఎస్పీకి మద్దతు ఇస్తే ఆ కూటమి బలం కొంత మేర పుంజుకునే అవకాశం ఉంది.
Also Read:‘ది ట్రెయిటర్స్’..తెలుగులో!
ఈ లెక్కలన్నింటినీ పరిశీలించిన తర్వాతే అఖిలేశ్ యాదవ్ మూడో అభ్యర్థిని పోటీకి దింపకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదనపు సీటు కోసం జరిగే పోరులో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడటం కంటే.. ప్రస్తుతం ఉన్న బలాన్ని కాపాడుకోవడమే మేలని ఎస్పీ భావించినట్లు తెలుస్తోంది.

