అజిత్‌పై గౌతమ్ గంభీర్ ప్రశంసలు..

3
- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌పై ప్రశంసలు కురిపించారు. అగార్కర్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయనకు గంభీర్ వీడ్కోలు సందేశం ఇచ్చారు. అగార్కర్ హయాంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో గౌరవంగా ఉందని గంభీర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, జట్టు ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన విధానానికి మూడు ఐసీసీ ట్రోఫీలు నిదర్శనమని అన్నారు. ఎప్పుడూ ‘జట్టు ముందు.. జట్టు ప్రయోజనాలే ముఖ్యం’ అనే సిద్ధాంతంతో అగార్కర్ పనిచేశారని గంభీర్ కొనియాడారు.

అంతేకాకుండా అగార్కర్ పనితీరును భవిష్యత్తులో చరిత్ర మరింత సానుకూలంగా అంచనా వేస్తుందని గంభీర్ అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్‌కు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు.

2023 జూలైలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ పదవీకాలంలో భారత జట్టు పలు కీలక విజయాలు సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరగా.. 2024 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ కైవసం చేసుకుంది. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ విజేతగా నిలిచింది.

Also Read:‘ది ట్రెయిటర్స్’..తెలుగులో!

అయితే అగార్కర్ పదవీకాలం పూర్తిగా విమర్శలకు దూరంగా లేదు. సీనియర్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలపై ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అగార్కర్ తీసుకున్న నిర్ణయాలు అంత సులభమైనవి కావని, సీనియర్ ఆటగాళ్లను దశలవారీగా తప్పించే బాధ్యత ఆయనపై ఉందని వ్యాఖ్యానించారు.

అగార్కర్ తన పదవికి పొడిగింపు కోరలేదని, దీంతో కొత్త చీఫ్ సెలెక్టర్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ప్రస్తుతం కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపిక ప్రక్రియకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది.

- Advertisement -