మరదలు కోసం నిధులు వరదలా పారించారు బావగారు. పైకి చూడ్డానికి ఉప్పు..నిప్పులా ఉండేవారు. ప్రతిరోజు యుద్దవాతావరణాన్ని తలపించే విధంగా కత్తులు దూసుకున్నారు. కానీ ప్రభుత్వం సొమ్ము కాజేయడంలో బంధుప్రీతి మాత్రం అచంచలం. ఎంతకీ ఎవరా నేతలు అనుకుంటున్నారా..వారే యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన మరదలు అపర్ణా యాదవ్.
అపర్ణకు జీప్ ఆశ్రయ్ స్వచ్చంధ సంస్థ పేరుతో రూ.9 కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని అఖిలేష్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ఖండించాల్సిన అఖిలేష్ తన పొరపాటుతో విమర్శలపాలయ్యారు. కుంభకోణానికి సంబంధించి ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక ప్రచురించిన వార్తను తన ట్విట్టర్‌లో షేర్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఆ పత్రిక అఖిలేష్ కుంభకోణానికి పాల్పడ్డాడని వార్తను ప్రచురించగా దానిని పొరపాటున ఆయన షేర్ చేశారు.
ట్విట్టర్లో అఖిలేష్‌కి దాదాపుగా 3.59 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అఖిలేష్ షేర్ చేసిన వార్తతో వారంతా అయోమయంలో పడ్డారు. కొంతమంది అఖిలేష్ ఇలాంటి వార్తను ట్విట్ చేశాడేంటి..అనే ప్రశ్నను సంధించగా మరికొంతమంది దానిపై సెటైర్లు వేసేశారు. ప్రముఖ ఆంగ్లపత్రిక తొలిపేజీలో అఖిలేష్‌కి సంబంధించిన వార్త రావడంతో సంతోషంలో ట్విట్ చేశాడంటూ చమత్కరించారు.కొద్ది నిమిషాల్లోనే అఖిలేష్ చేసిన ట్విట్ వైరల్ కావడంతో దానిని ఆయన తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అపర్ణా యాదవ్ ఆమె భర్త జీప్ ఆశ్రయ్ పేరుతో ఓ స్వచ్చంధ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ కింద కన్హాఉప్‌వాన్ పేరుతో గోశాలను నిర్వహిస్తున్నారు. అక్కడ గాయపడిన, అనారోగ్యంతో ఉన్న గోవులకు ఆశ్రయం కల్పిస్తారు. అంతవరకు బాగానే ఉన్న ఇక్కడే బావా మరదళ్లు ఓ కుంభకోణానికి తెరలేపారు. సమాజ్‌వాది ప్రభుత్వం 2012 నుంచి 2017 వరకు.. ఐదేళ్ల కాలంలో పలు గోశాలలకు రూ. 9 కోట్ల 66 లక్షలు మంజూరు చేసింది. అయితే అపర్ణా యాదవ్‌కు చెందిన జీప్ ఆశ్రయ్ సంస్థకు ఇందులో 86 శాతం నిధులు మంజూరు అయ్యాయి. అంటే మొత్తం గ్రాంట్‌లో రూ. 8కోట్ల 35 లక్షలు ఆశ్రయ్‌కు దక్కాయన్నమాట. నూతన్ ఠాకూర్ అనే వ్యక్తి ఆశ్రయ్ కింద దరకాస్తు పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది.