యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అఖిలేశ్ తలసాని ఇంటిలో తేనీటి విందుకు హాజరయ్యారు
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లను ముమ్మరం చేసిన వేళ, వాస్తవానికి తానే స్వయంగా లక్నో వెళ్లి అఖిలేష్ యాదవ్, ములాయం యాదవ్ లతో భేటీ అయి మాట్లాడాలని కేసీఆర్ భావించినప్పటికీ, ములాయం సూచన మేరకు అఖిలేష్, తానే హైదరాబాద్ వస్తానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమవుతారు. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తరువాత, కేటీఆర్ సహా కొంతమంది నేతలతోనూ ఆయన భేటీ అవుతారు. అఖిలేష్ యాదవ్ కు కమ్మనైన విందు ఇచ్చేందుకు ఉత్తరాది, దక్షిణాది వంటకాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. ఈ భేటీల తరువాత సాయంత్రం 4.30 గంటలకు అఖిలేష్ లక్నో తిరిగి బయలుదేరుతారు.