దేశంలో మోదీ, అమిత్ షాల ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు రాజకీయ విధానాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాంతీయ పార్టీని జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా తీర్మానించడమే జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు. ఈ పరిణామాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా భారత్ రాష్ట్ర సమితిని బలపర్చాల్సిన అవసరం వుందన్నారు. చిరకాలంగా కేంద్రంలో కొనసాగుతున్న ఉత్తరాది ఆధిపత్యానికి విరుగుడుగా, జాతీయ సంపదలను కార్పోరేట్లకు దోచిపెడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో ఎండగట్టి బలమైన ప్రతిపక్ష ఏర్పాటుకు దక్షిణాది నుండి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు.
ఉన్మాద చర్యలతో దేశంలో అశాంతి, అసహనం, ఆందోళన, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ అప్రతిహతంగా తమ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్దపడి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అనేది అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నట్లు సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.