చైనా సైన్యం మరోసారి తెగబడింది. తన దుందుడుకు వైఖరితో మరోసారి భారత భూభాగంలోకి చొరబడేందుకు విఫలయత్నం చేసింది. కశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలోకి రావడానికి ప్రయత్నించాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య రెండుసార్లు చొరబాటు ప్రయత్నించినా.. భారత సరిహద్దు దళాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరగడంతో కొందరికి గాయాలైనట్లు తెలిపారు.
టిబెట్ నుంచి భారత భూభాగం వరకు విస్తరించిన ఉన్న ఈ సరస్సు మూడింట రెండొంతుల భాగం చైనా నియంత్రిస్తూ వస్తోంది. దీనికి ఆనుకొని ఉన్న ఫింగర్ 4, ఫింగర్ 5 భాగాలను కూడా ఆక్రమించాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా సైనికులు ప్రయత్నించారని, దీంతో భారత జవాన్లు వారిని అడ్డుకున్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని, రాళ్లు కూడా రువ్వుకున్నారని వెల్లడించారు.
ఆనవాయితీగా నిర్వహించే బ్యానర్ డ్రిల్ ద్వారా రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్లడంతో ఉద్రిక్తత చల్లారింది. అయితే ఈ ఘటనపై స్పందించడానికి ఢిల్లీలోని ఆర్మీ అధికార ప్రతినిధి నిరాకరించారు. ఇప్పుడు చైనా చొరబాటుకు ప్రయత్నించిన ఫింగర్ ఫోర్ ప్రాంతంపై కూడా వివాదం నడుస్తున్నది. రెండు దేశాలు ఈ ప్రాంతాన్ని తమదిగా చెప్పుకుంటున్నాయి. 1990ల్లో చైనాతో చర్చల్లో ఈ ప్రాంతాన్ని తమదిగా భారత్ చెప్పుకోగా.. అది ఆక్సాయ్‌చిన్‌లో భాగమని చైనా వాదించింది. అంతేకాదు ఫింగర్ ఫోర్ వరకు రోడ్డు నిర్మాణం కూడా చేసింది. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు ఐదు కిలోమీటర్ల దూరంలో సిరి జాప్ ప్రాంతంలో ఉంటుంది. తరచూ ఈ ప్రాంతంలోకి చైనా చొరబాటుకు యత్నిస్తుండటంతో.. ఇక్కడి సరస్సుపై హై స్పీడ్ బోట్స్‌తో ఇండియన్ ఆర్మీ గస్తీ కాస్తున్నది.