‘మా’ కల త్వరలోనే నెరవేరుతుంది- మంచు విష్ణు

86

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్‌ రాజ్, జీవిత, హేమ, నరసింహారావులు బరిలోకి దిగారు. వారు తమ అభ్యర్థిత్వాలను ప్రకటించుకున్నారు. దీంతో ఇప్పుడు ఐదుగురు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక మా ఎన్నికల బరిలో నిలబడతానని ప్రకటించిన మంచు విష్ణు.. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఓ ప్రత్యేక భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే తన జేబులోంచి డబ్బులు పెట్టి భవంతిని కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ తన హామీలు ఉత్తవి కావని నిరూపించేందుకు విష్ణు సంచలన ప్రకటన చేశారు.

తాజాగా మంచు విష్ణు ‘మా’కు సంబంధించి ఓ వీడియో మెసేజ్ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నాటి ‘మా’ కల త్వరలోనే నెరవేరుతుందని ఆయన చెప్పారు. ‘మా’కు శాశ్వత భవనం ఉండాలన్నది అసోసియేషన్ సభ్యులందరి కల అని, అందుకోసం ఓ మూడు స్థలాలను చూసొచ్చానని ఆయన చెప్పారు. అసోసియేషన్‌తో చర్చించి ఆ మూడు స్థలాల్లోను ఒకటి ఎంపిక చేసి, దాంట్లో భవనం నిర్మిస్తామని తెలిపారు. కారులో వెళుతూ ఇచ్చిన ఆ వీడియో సందేశాన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా, గత పాలకవర్గం సమయం ముగుస్తున్న నేఫథ్యంలో.. కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు జరగాల్సిఉంది. కాని ఇప్పటివరకు మా అసోసియేషన్‌ నుంచి గాని.. అసోసియేషన్‌ పెద్దల నుంచి గాని ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ.. ప్రస్తుత పాలకవర్గానికి వ్యతిరేకంగా ప్రకాష్‌రాజ్‌ ఓ ప్యానల్‌ను తెరపైకి తీసుకొచ్చారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులను ప్యానల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.