187 పెట్రోల్ బంకులకు నోటీసులు…

552
akun sabharwal
- Advertisement -

రేషన్‌ షాపుల ద్వారా పేదలకు అందించే బియ్యం, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేసే సన్నబియ్యం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌  మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి స్పష్టం చేశారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ బంకుల్లో క్వాలిటీ, క్వాంటిటీ, టాయిలెట్‌, మంచినీరు, వాహనాలకు గాలి వంటి కనీస వసతులు విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తామని అన్నారు.

పౌరసరఫరాల సంస్థకు చెందిన ఆధునికీకరించిన సెక్రటేరియట్‌ పెట్రోల్‌ బంకును సోమవారం నాడు చైర్మన్‌ శ్రీ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు అందించే బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగారి ఆలోచనలు, సూచనలు, ఆదేశాల ప్రకారం బియ్యం నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇందుకోసం పౌరసరఫరాల సంస్థలో సాంకేతిక సిబ్బందితో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

టెక్నికల్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం గోదాముల్లో బియ్యం నాణ్యతను పరిశీలించడం జరుగుతుందన్నారు.సీఎంఆర్‌ కింద రైస్‌ మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు అప్పగించే బియ్యం నాణ్యత విషయంలో కూడా ఈ బృందం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.

పెట్రోల్‌ నాణ్యత విషయంలో ఇటీవల పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ రాష్ట్రవ్యాప్తంగా 2553 పెట్రోల్‌ బంకులకు గాను, 638 బంకుల్లో తూనికల, కొలతల, పౌరసరఫరాలు, ఆయిల్‌ కంపెనీల అధికాలుల ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరిగింది. నిబందనలు ఉల్లంఘిస్తున్న 187 బంకులకు నోటీసులు జారీచేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చైర్మన్‌ స్పష్టం చేశారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌తో పాటు ఎల్‌.బి.నగర్‌, హఫీజ్‌పేట్‌లో పెట్రోల్‌ బంకులు నడుస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ పెట్రోల్‌ బంకులను పౌరసరఫరాల సంస్థలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

- Advertisement -