చైతన్య దీప్తి…క్రమశిక్షణకు మారుపేరు…ఓ గొప్ప సైంటిస్టు…. గొప్ప రాష్ట్రపతి…. మంచి రచయిత. అంతకు మించిన మార్గనిర్దేశకుడు… అందరికీ ఆదర్శనీయుడు. అంతకుమించి గొప్పదేశ భక్తుడు..ఆయనే మిస్సైల్ మ్యాన్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం.పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా సాగిన ఆయన పయనంలో దేశ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పారు. నేడు కలాం వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ….
కలాం పూర్తిపేరు డాక్టర్ అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలాం. అక్టోబర్ 15,1931న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు అషియమ్మ జైనుల్లాబ్దీన్, జైనుల్లాబ్దీన్ మరకయార్. ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958లో మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఎం) నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు.
1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. అక్కడ ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III)ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.
1982లో, ఆయన డీఆర్డీవో డైరక్టరుగా తిరిగి బాధ్యతలు చేపట్టి గైడెడ్ మిస్సైల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. అగ్ని, పృథ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి చేసి ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. అంటే దేశానికి తొలి మిస్సైల్‌ను అందించిన ఘనత ఆయనదే. అందుకే ఆయనకు “మిస్సైల్ మాన్” అనే పేరు కూడా వచ్చింది.
Also Read:TTD:కర్ణాటకలో సత్రాల అభివృద్ధిపై రివ్యూ
1992లో దేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. సైంటిస్టుగా రిటైర్డయ్యాక.. దేశ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు కలాం. రాజకీయాలతో సంబంధం లేకుండా అధికార, విపక్షాల మద్దతుతో రాష్ట్రపతిగా ఎన్నికైన అబ్దుల్ కలాం ఆ పదవికే వన్నె తెచ్చారు. భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ భూషణ్ (1981), పద్మ విభూషణ్ (1990), భారతరత్న (1997)లు వరించాయి. అలాగే, దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీసం 30వరకు యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి.
అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి. మద్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. “ప్రజలు.. తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులౌతారు” అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. కానీ, కలాం ఖురాన్‌తో పాటు, భగవద్గీతను కూడా చదివారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడిగా పేరుగడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ వంటి అనేక పుస్తకాలను రచించారు.
Also Read:ట్రెండింగ్‌లో ‘టిల్లు స్క్వేర్’ సాంగ్