ఎగ్జిగ్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఓ ప్రాంతీయ పార్టీ సంచలనం సృష్టించింది. పంజాబ్‌లో తిరుగులేని విజయాన్ని సాధించిన కాంగ్రెస్ , బీజేపీలను ఊడ్చి పారేసింది ఆప్. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి మేథస్సు ముందు తలపండిన రాజకీయ నాయకులు సైతం తేలిపోయారు. ఆప్ దెబ్బకు ఒక్క బీజేపీనే కాదు..అధికార కాంగ్రెస్ కూటమి, ఇతర ప్రాంతీయ పార్టీలు సైతం పంజాబ్ లో కనుమరుగయ్యాయి.
రైతు చట్టాలు సహా మహిళలకు ప్రాధాన్యత,కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ ఇలా పంజాబ్‌ను ఊడ్చేసేందుకు ఆప్‌కు కలిసివచ్చిన అంశాలు. పంజాబ్ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేజ్రీవాల్.. ముందు నుంచి వ్యూహాత్మక ప్రచారంతో దూసుకుపోయారు. పంజాబ్ రైతులు, రైతు సంఘాల నేతలతో నిరంతరం టచ్ లో ఉంటూ తనకు కలిసివచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్‌గా మార్చుకున్నాడు.
ఇక కేజ్రీవాల్ ప్రధానంగా యువత మరియు మహిళా ఓటర్లను టార్గెట్ చేయగా వారిని నుండి ఆప్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. రాష్ట్రంలోని మహిళల ఖాతాలలో నెలకు రూ. 1,000 జమ చేస్తానని కేజ్రీవాల్ ఇచ్చిన వాగ్దానం ఆప్‌ను వారికి మరింత దగ్గర చేసింది. ఇక సీఎం అభ్యర్థిగా భగంత్ మాన్‌ను ప్రకటించి కేజ్రీ…వేసిన ఎత్తుగడ సత్ఫలితాన్నిచ్చింది.
మాన్…సినిమాలు, టీవీల ద్వారా పంజాబ్ ప్రజలకు సుపరిచితుడు. తన రాజకీయ మరియు సామాజిక వ్యంగ్య కథనాలతో పంజాబీల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. 2014లో ఆప్ లో చేరి 019 ఎంపీ ఎన్నికల్లో పంజాబ్ నుండి ఒకే ఒక ఆప్ ఎంపీగా గెలుపొందాడు.