తెలంగాణ ఎన్నికల వాతావరణం హిటెక్కింది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూకుడుపెంచాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ క్షేత్రస్ధాయిలో రంగంలోకి దిగగా ప్రతిపక్ష పార్టీలు తమదైన వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నాయి. శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ నుంచి ఆయనను సీఎం అభ్యర్థిగా బరిలోకి దించేందుకు కాషాయ దళం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పోటీ చేసే స్థానంపై పుకార్లు షికారు చేస్తున్నాయి. సెటిలర్లు అధికంగా ఉండే, జూబ్లీహిల్స్ నుంచి పరిపూర్ణానంద పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే, పార్టీ ఏ బాధ్యతలను తనకు అప్పగిస్తే, చేయడానికి సిద్దంగా ఉన్నానని పరిపూర్ణానంద తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని .. దేశం కోసం, ధర్మం కోసం ఏ సూత్రాలను, సిద్ధాంతాలను ఆరెస్సెస్ కొనసాగిస్తూ వచ్చిందో, వాటిని రాజకీయ కోణంలో సమాజానికి మరింత చేరువ చేసే దిశగా బీజేపీ కృషిచేస్తోందన్నారు . మొత్తానికి యూపీలో ఆదిత్యయోగినాథ్‌లా కాషాయదళం సంధిస్తున్న స్వామిజీ అస్త్రం ఎలాంటి ఫలితం రాబడుతుందో కాలమే సమాధానం చెప్పాలి.