సామాజిక మాధ్యమాలు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తిని అడ్డుకునేలా కేంద్రం కఠిన చర్యలు చేపడుతోంది. విద్వేషాల్ని రెచ్చగొట్టేలా ప్రసారాలు చేస్తోన్న పలు యూట్యూబ్ ఛానళ్లపై ఇప్పటికే నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో 10ఛానళ్లపై కొరడా ఝుళిపించింది.
మత విద్వేషాలను వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంతో నకిలీ వార్తలు మార్ఫింగ్ చేసిన కంటెంట్‌ని ప్రసారం చేస్తోన్న 45యూట్యూబ్ వీడియోలతో పాటు 10యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. అగ్నిపథ్ పథకం, భారత సాయుధ దళాలు, దేశ భద్రత, కశ్మీర్‌కు సంబందించిన అంశాలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. బ్లాక్ చేసిన వీడియోలకు దాదాపు 1.30కోట్లకు పైగా వీక్షకులు ఉన్నట్టు అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
దేశ భద్రత దృష్ట్యా కంటెంట్‌ని తప్పుడు సమాచారంగా సున్నితమైనదిగా పరిగణించి వాటిని బ్లాక్ చేయాలని ఈ నెల 23న ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్రం పేర్కొంది. ఇంతకు ముందు కూడా దేశంలో మత సామరస్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నించేలా ప్రసారాలు చేసిన 102యూట్యూబ్ ఛానళ్లతో పాటు పలు ఫేస్‌బుక్ ఖాతాలను కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే.