తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు సైకో శ్రీనివాసరెడ్డి కస్టడీ ముగిసింది. నేడు శ్రీనివాసరెడ్డిని యాదాద్రి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశానుసారం తిరిగి నిందితుడిని వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు. శ్రీనివాసరెడ్డిని బుధవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆరు రోజుల పాటు విచారించారు. నిందితుడు శ్రీనివాసరెడ్డిని పలు కోణాల్లో పోలీసులు ప్రశ్నించారు. బాలికల అత్యాచారం, హత్యలలో మరికొందరి పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే విచారణ కోసం పగటిపూట వెళ్తే గ్రామస్థులు దాడిచేసే అవకాశం ఉండటంతో రాచకొండ పోలీసులు రాత్రి సమయంలో శ్రీనివాస్‌రెడ్డిని హాజీపూర్‌కు తీసుకెళ్లారు. ఘటనల స్థలాల్లో హత్యలపై క్రైమ్ సీన్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు. అతడి నేరాలకు సంబంధించిన అన్ని ఆధారాలను భద్రపర్చారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబసభ్యులను కూడా ప్రశ్నించారు. ఇప్పటివరకు శ్రావణి, మనీషా, కల్పన అనే మైనర్లతోపాటు కర్నూలులో ఓ మహిళను కూడా తానే, లైంగికదాడి చేసి హత్య చేశానని శ్రీనివాస్‌రెడ్డి వాంగ్మూ లం ఇచ్చినట్టు సమాచారం.
శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం బయటపడిన తర్వాత అతడు మరికొన్ని హత్యలుచేసి ఉంటాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. విచారణలో నాలుగు హత్యలే తప్ప ఇతర విషయాలు అతడి నోటినుంచి రాలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన కాల్ డాటాను పరిశీలించనున్నారు. ఈ కోణంలోనే శ్రీనివాసరెడ్డిని విచారించినట్టు తెలుస్తోంది.