పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారనే వార్త ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు మంత్రివర్గంలో 11 మందికి ఛాన్స్ దక్కగా మలిదశ విస్తరణలో చోటు దక్కించుకోవడానికి ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మిగిలింది ఆరు కేబినెట్ బెర్తులే కావడంతో ఆశావాహుల సంఖ్య చాంతాండంత ఉంది.
ఇక ఇప్పటికే నల్గొండ వేదికగా సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి త్వరలో పెద్దపదవి రాబోతుందని(మంత్రి పదవి)పై హింట్ ఇచ్చేశారు. ఇక మిగిలింది ఐదుగురే.వీరిలో రెండు మహిళలకు కేటాయిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు,సీనియారిటీ ఆధారంగా కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు గులాబీ బాస్.
కాంగ్రెస్ తరపున గెలిచిన 13 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో కేబినెట్ విస్తరణలో వీరిలో ఇద్దరికి మంత్రి పదవులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. వీరిలో ప్రముఖంగా సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సబితా హోంమంత్రిగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించగా చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు గండ్ర. కేబినెట్‌లో వీరికి ఛాన్స్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా 33 జిల్లాల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు అదే సంఖ్యలో కీలక పదవులలో ఉన్న వారు అవసరం. దీంతో జూన్ 2లోపే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని, అలాగే కీలకమైన నామినేటెడ్ పదవులు అన్ని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. మరోవైపు టీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేతలు సైతం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మొత్తంగా కేబినెట్‌లో ఎవరికి బెర్త్ దక్కుతుందో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.