గ్రేటర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్ పేట-హైటెక్‌సిటీ మెట్రోకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ రూట్‌లో మెట్రోని నడిపేందుకు సీఎంఆర్‌ఎస్ అనుమతులిచ్చేసింది. అమీర్ పేట-హైటెక్‌సిటీ రూట్లో మెట్రోకి అన్ని అనుమతులు వచ్చేశాయని త్వరలోనే ప్రారంభతేదీని అనౌన్స్ చేస్తామని తెలిపారు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.
హైదరాబాద్ మెట్రోలో కీలకంగా ఉన్న అమీర్ పేట – హైటెక్ సిటీకి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 2018 నవంబర్‌లోనే పనులు పూర్తయ్యాయి. 4 నెలలుగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్న అధికారులు సీఎంఆర్‌ఎస్ అప్రూవల్ కోసం ఎదరుచూశారు. పిబ్రవరిలో తనిఖీలు నిర్వహించిన అధికారులు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా ఉండనుంది. అమీర్ పేట – హైటెక్ సిటీ మార్గంలో మొత్తం 8 స్టేషన్లున్నాయి. మధురానగర్ ,యూసుఫ్ గూడ, జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ,పెద్దమ్మ గుడి,మాదాపూర్ దుర్గం చెరువు,హైటెక్ సిటీ.
ప్రస్తుతం రెండు కారిడార్‌లలో 46 కి.మీ మేర మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కారిడార్-1లో ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో 29 కి.మీ, కారిడార్-3లో నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు 17 కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి.