తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కాంగ్రెస్ లో దళిత నేతలకు సరైన గౌరవం లేదన్నారు. అందుకే దళిత ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని చెప్పారు. ఈసందర్భంగా సచివాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వస్తే కనీసం 10వేల మంది జనసమీకరణ కూడా చేయలేకపోయారని విమర్శించారు. ఉత్తమ్ ఓ సైకో అని ఆయన రాత్రి 12గంటల వరకూ నిద్రపోడని, మరుసటి రోజు 12గంటల వరకూ నిద్రలేవరని పరుష పదజాలంతో ఉత్తమ్ ను దూషించారు ఎమ్మెల్యే చిరుమర్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ భ్రష్టుపడుతోందన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కాంగ్రెస్ లో సరైన గౌరవం లేదన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరతానని స్పష్టం చేశారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుస్తానని తేల్చిచెప్పారు. ఈవిషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే నల్లగొండ జిల్లా అభివృద్ది చెందిందన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ రాజకీయంగా తనుకు చాలా సహకరించారని చెప్పారు. వారు టీఆర్ఎస్ లోకి వస్తారన్న విషయం తనకు తెలియదన్నారు. ఎన్నికల సమయంలో తాను నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామిల మేరకే తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నట్లు చెప్పారు.