అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్ వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్ మోంగా నిర్మించిన ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు.
ఢిల్లీకి సమీపంలోని కతిఖేరా గ్రామంలో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న ఆ గ్రామస్తులపై ఈ డాక్యుమెంటరీ తీశారు. అమెరికా ఫిల్మ్‌మేకర్ రఖ్యా జెహతబాచీ దీన్ని డైరక్ట్ చేశారు. రుతుక్రమంపై భారత్‌లో ఉన్న అనాదికాల అపోహలను పటాపంచలు చేసేందుకు ఈ డాక్యుమెంటరీని తీశారు. షార్ట్ ఫిల్మ్‌లో ప్రధానంగా .. శానిటరీ ప్యాడ్ల తయారీని చూపిస్తారు. లాస్ ఏంజిల్స్‌లోని ఓక్‌వుడ్ స్కూల్ విద్యార్థులు ప్యాడ్ ప్రాజెక్టులో భాగంగా ఈ కథను ఎన్నుకొన్నారు. దాన్నే డాక్యుమెంటరీగా తీశారు. మహిళల్లో వచ్చే పీరియడ్స్ వాళ్ల జీవితాలను నాశనం చేయకూడదని, ఓ అమ్మాయి విద్యను అడ్డుకోకూడదన్న సందేశాన్నిచ్చారు.
2009లో భారతీయ కథాంశంతో రూపొందించిన స్లబ్ డాగ్ మిలియనీర్ తర్వాత మళ్లీ మన దేశ కథకు ఆస్కార్ దక్కింది. బ్లాక్ షీప్, ఎండ్ గేమ్, లైఫ్‌బోట్, ఎ నైట్ ఎట్ ద గార్డెన్ డాక్యుమెంటరీలు ఈ క్యాటగిరీలో పోటీపడ్డాయి. ఇవాళ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్స్ ప్రదానోత్స కార్యక్రమంలో పీరియడ్ టీమ్ అవార్డును అందుకున్నది.