ఓ వైపు చంద్రబాబు మరోవైపు జగన్ సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అవుతుండగా జనసేన అధినేత పవన్ సైతం తన సత్తాచూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఏపీలో క్షేత్రస్ధాయిలో కమిటీలను వేసిన పవన్ తన పర్యటనల సందర్భంగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే పవన్ మాత్రం ఎక్కడి నుండి పోటీచేస్తారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతునే ఉంది.
జనసేన స్ధాపించిన తొలినాళ్లలో తాను అనంతరపురం జిల్లా నుండి పోటీచేస్తానని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే జనసేన పార్టీ తొలి కార్యాలయాన్ని అనంతపురంలోనే ప్రారంభించారు. అయితే అనంతపురంతో పాటు మరోస్ధానం నుండి పవన్ బరిలోకి దిగితే పార్టీకి లాభం చేకూరుతుందని జనసేన నాయకులు భావిస్తున్నారు.అందుకే రెండు చోట్ల పవన్ పోటీచేసేందుకు ఒప్పించారట.
దీంతో తనకు టికెట్ కేటాయించాల్సిందిగా రెండు రోజుల క్రితం పార్టీ స్క్రీనింగ్ కమిటీకి స్వయంగా దరఖాస్తు చేసుకున్నారు పవన్.విశాఖలోని గాజువాక లేదా తూర్పు గోదావరి జిల్లా నుంచి టికెట్ కేటాయించాలని పార్టీ నేతలను కోరారట పవన్.
దీంతో పార్టీబలంగా ఉన్న గాజువాక వైపు స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. లక్ష సభ్యత్వాలతో ఏపీలోనే గాజువాక నియోజకవర్గం అగ్రస్థానంలో ఉండడమే ఇందుకు ఒక కారణంగా తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదేగనుక నిజమైతే పవన్ అనంతపురంతో పాటు విశాఖ లేదా తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక స్ధానంలో బరిలో ఉండనున్నారు.