బరి నుండి తప్పుకున్న మధుయాష్కి..!

216
madhu yashki
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షాక్‌ నుండి కాంగ్రెస్ పార్టీ ఇంకా కొలుకోలేదు. పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహించేందుకు ఏ నాయకుడు ముందుకురాకపోవడం ఓ వైపేతే ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుండి బయటపడుతున్న ఆ పార్టీ నేతలకు మరో తలనొప్పి వచ్చిపడింది. ఇటీవల నియమించిన డీసీసీ అధ్యక్షుల నియామకాలపై పలు జిల్లాల్లో అసంతృప్త జ్వాలలు వెలువడుతున్నాయి.

దీనికి తోడు రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ సూచించగా నామమాత్రపు స్పందనవస్తోంది. కొన్నిజిల్లాల్లో ఒకరిద్దరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా కొన్నిజిల్లాల్లోనైతే హస్తం నేతలకు కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య ఓట్ల వ్యత్యాసం 2 లక్షల వరకు ఉంది.

ఇప్పటివరకు గతంలో ఇదే సెగ్మెంట్ నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన మధుయాష్కి ఇక్కడి నుండి పోటీచేస్తారని అంతా భావించారు. కానీ ఆయన పోరు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ బరిలో నిలిచింది సీఎం కేసీఆర్ కూతురు కవిత.స్థానికంగా ఆమెకు గట్టిపట్టుఉండటంతో పాటు బలమైన ఓటు బ్యాంకును సాధించడంలో ఆమె సఫలమైంది. దీంతో పోటీచేసేందుకు మధుయాష్కి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సీనియర్‌ నేత జీవన్ రెడ్డి ఓటమిపాలవడంతో జిల్లాశ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.ఈ నేపథ్యంలో ఇక్కడి నుండి బరిలోకి దిగటం కంటే వేరే సీటు వెతుక్కోవడం మేలనే ఫీలింగ్‌లో ఉన్నారట మధుయాష్కి.ఇదే విషయాన్ని అధిష్టానం పెద్దలకు సైతం వివరించారట.

దీంతో చేసేదేమీ లేక ప్రత్యామ్నాయ నేతలను ఎంచుకునే పనిలో పడ్డారు టీపీసీసీ నేతలు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందని పీసీసీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ సుదర్శన్ రెడ్డి పోటీకి ఒప్పుకోకపోతే బీజేపీ నేత ధర్మపురి అరవింద్ కు గాలం వేయాలని యోచిస్తున్నారు.ఏదిఏమైనా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది.

- Advertisement -