తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి కూకట్ పల్లి అభ్యర్థి, టీడీపీ నేత నందమూరి సుహాసిని ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సుహాసిని నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె వెంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, నేతలు తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి భారీఎత్తున టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరంకు ఆమె కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇక తన సోదరి నందమూరి సుహాసిని పోటీ చేయడంపై హీరోలు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. తెదేపా మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్న హరికృష్ణ తెదేపాకు ఎనలేని సేవలందించారు.
మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది. అదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతోన్న మా సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నాం. జై ఎన్టీఆర్. జోహార్ హరికృష్ణ.’ అని కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ పేర్కొన్నారు.