ఆదర్శ పురుషులకు కేరాఫ్ మరాఠా ప్రాంతమని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లలితకళా తోరణంలో మరాఠా కమ్యూనిటీ సభలో పాల్గొన్న కేటీఆర్ జై తెలంగాణ.. జై మహారాష్ట్ర.. జై భవానీ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మహిళలు చదువుకోవాలని పిలుపునిచ్చిన ప్రాంతం..రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ పుట్టినిల్లు,జ్యోతిరావు పూలేది మరాఠా ప్రాంతమేనని వెల్లడించారు.
హైదరాబాద్ ఒక మినీ ఇండియా.. అన్ని తెగల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని తెలిపారు కేటీఆర్. వీరత్వానికి, సాహసానికి శివాజీ ప్రతీక. మహారాష్ట్ర మీ జన్మభూమి అయినా హైదరాబాద్‌ను మీ కర్మ భూమిగా భావిస్తున్నారని తెలిపారు. తాను పూణెలో మాస్టర్స్ చదివానని తెలిపారు. 300 ఏళ్ల పైనుంచి మరాఠాలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని తెలిపారు. మరాఠా సంక్షేమ భవనానికి 2 ఎకరాల స్థలం, రూ.2 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌లో విద్యుత్ కోతలుండేవని విద్యుత్ కోతల వల్ల వ్యాపారులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషితో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 90 శాతం నీటి సమస్య తీరిందన్నారు. శాంతిభద్రతల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో మరాఠాలు మద్దతు అందించి టీఆర్ఎస్ ని గెలిపించాలన్నారు.