మంత్రి కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ. తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజలకు అండగా ఉంటానంటూ కేటీఆర్ అనడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతపై చక్కగా మాట్లాడారని ..పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం సరికాదని వ్యాఖ్యానించారు. కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలు గుడ్డిగా పార్టీలకు ఓటు వేయడం మంచిది కాదని హితవుపలికారు. జేపీ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్… ధన్యవాదాలంటూ రీట్విట్ చేశారు.
నిన్న కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల ప్రజలతో మన హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, తమ ప్రభుత్వం అందించిన సుపరిపాలనలో హైదరాబాద్లో స్థిరపడిన ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో స్థిరపడిన ఇతర ప్రాంతాల ప్రజల బాధ్యత తాను స్వయంగా తీసుకుంటానని ప్రకటించారు.