టీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరు ఆపలేరు-కేటీఆర్‌

208
- Advertisement -

సోమవారం నాడు తెలంగాణ భవన్‌లో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్‌ వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచిందని, విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెసే కారణమని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని, నాలుగేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, ఏనాడు కాంగ్రెస్‌ పార్టీ.. ప్రభుత్వానికి, అభివృద్ధికి సహకరించలేదని, అనవసర, అర్ధంలేని కేసులతో అభివృద్ధికి ఆటంకంగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

తమ నాలుగేళ్ల పాలనలో, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో మిషన్‌ కాకతీయ ద్వారా వేలాది చెరువులను ఆధునీకరించామని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, ప్రతి ఎకరాకు నీరిచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రభుత్వం గొప్ప ఆశయంతో ప్రాజెక్టులను నిర్మిస్తుంటే కాంగ్రెస్‌ పనిగట్టుకొని ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగ కేసులు వేస్తోందని, చనిపోయిన వారి పేరు మీద కేసులు వేయిస్తూ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతోందని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR

త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ అర్ధంలేని వాగ్ధానాలు చేస్తోందని, ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలు నెరవేర్చాలంటే రాష్ట్రాల ఆదాయం సరిపోదని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీలను 2లక్షలకు పెంచుతామని చెబుతోందని, ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ పార్టీలు ఒక్కటయ్యాయని, గతంలో తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబుతో ఎలా జత కలుస్తారని మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని, కోదండరాంను ప్రశ్నించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపును ఆపలేరని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -