దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ఎంపికైనట్లు ప్రముఖ సర్వే నిర్వహణ సంస్థ వీడీపీ అసోసియేట్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ప్రజాదరణపై చేసిన సర్వే ఫలితాలను శుక్రవారం ఈ సంస్థ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రజాదరణ విషయంలో నిర్వహించిన సర్వేలో 87 శాతం రేటింగ్‌తో సీఎం కేసీఆర్ మళ్లీ ఆగ్రస్థానంలో నిలిచారని పేర్కొంది.
ఇక తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 51 శాతం ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలోనే పడతాయని వెల్లడించింది. వీడీపీ అసోసియేట్స్ అనేది ఎన్నికల సరళులపై సర్వే చేసే పోలింగ్ ఏజెన్సీ. నిర్దిష్ట వ్యవధుల్లో ఈ సంస్థ వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ ఉంటుంది. తాజాగా 15 రాష్ట్రాల్లోని 420 లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఈ సంస్థ సర్వే చేసింది. ప్రభుత్వ పనితీరు, పథకాల అమలు, ముఖ్యమంత్రి పాలన, జనాకర్షణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేసింది. ఈ సర్వేలో రెండో స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (86 శాతం); 79 శాతం జనాదరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (75శాతం); మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ (62 శాతం); బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (61 శాతం); రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే (58 శాతం); ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (58 శాతం) నిలిచారు. నిజానికి, ఇదే సంస్థ ఈ ఏడాది మేలో కూడా సర్వే నిర్వహించింది.
అప్పుడు కూడా కేసీఆర్ 86 శాతం జనాదరణతో మొదటి స్థానంలో నిలిచారు. ఆరు నెలల్లో ఆయన మరో శాతం జనాల ఆదరణ దక్కించుకుని మళ్లీ అగ్ర స్థానంలో నిలిచారు. అలాగే, అప్పట్లో ఐదో స్థానంలో నిలిచిన చంద్రబాబు (69 శాతం) ఆరు నెలల్లోనే ఎనమిదో స్థానాని (58 శాతం)కి పడిపోయారు. 2014 ఎన్నికలతో పోలిస్తే, రాష్ట్రాలవారీగా ఓట్ల శాతాల విషయంలో తెలంగాణలో టీఆర్ఎస్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీగా లాభపడ్డాయని పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలూ గులాబీ పార్టీయే కైవసం చేసుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. పాతబస్తీలో కూడా బలపడుతున్నామని ఇటీవల సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించగా, అందుకు అనుగుణంగానే హైదరాబాద్ సహా మొత్తం ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ దక్కించుకుంటుందని సర్వే పేర్కొనడం గమనార్హం.
సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ హవా కొనసాగుతున్నది. ప్రధానిగా ఆయనే సమర్థుడని 55 శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. మరోవైపు.. త్వరలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీపార్టీ ప్రభంజనం సృష్టించనున్నదని సర్వే వెల్లడించింది.
సర్వేతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్ధాయిలో ప్రజలకు చేరువవుతున్నాయని స్పష్టమవుతోంది. ప్రత్యక్షంగా ప్రజలకు చేరే వివిధ రకాల పింఛన్లు, రేషను బియ్యం, ఆరోగ్యశ్రీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, డబుల్బెడ్రూం ఇండ్లు తదితర పథకాల కారణంగానే కేసీఆర్‌కు జనం పట్టం కట్టినట్లుగా స్పష్టమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. దూరదృష్టితో చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, నిరంతర విద్యుత్ సరఫరా తదితర ప్రాజెక్టులు కూడా ప్రజల మీద సానుకూల ప్రభావం చూపినట్లుగా సర్వే వెల్లడిస్తున్నది.