తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రముఖ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హ్యుందయ్ మోబిస్ ఆటోమొబైల్ కంపెనీ హైదరాబాద్‌లోని కొల్లూరు ఐటీ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఈ సందర్బంగా క్యాంపు కార్యాలయంలో హ్యుందయ్ మోబిస్ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన హ్యుందయ్ మోబిస్ ప్రతినిధులు కంపెనీ కార్యకలాపాలకు కొల్లూరును అనువుగా ఎంచుకున్నారు.
దీంతో టీఎస్‌ఐఐసీ.. కొల్లూరులోని ఐటీ క్లస్టర్‌లో హ్యుందయ్ మోబిస్ కంపెనీకి 20 ఎకరాలు కేటాయించింది. కంపెనీ ఇక్కడ ఏర్పాటుచేయబోయే క్యాంపస్ ద్వారా 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనుండగా, అందుకు మూడురెట్ల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. 2020 నాటికి ఇక్కడి నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. హ్యుందయ్ మోబిస్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. కొల్లూరులో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న మొబిలిటీ క్లస్టర్‌కు ఈ పెట్టుబడి గొప్ప బలం ఇస్తుందని తెలిపారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. హ్యుందయ్ మోబిస్ పెట్టుబడి ద్వారా హైదరాబాద్‌లో ఆటోమోటివ్, స్మార్ట్ మొబిలిటీ ఎకోసిస్టమ్ విస్తరణకు మరిన్ని అవకాశాలు ఏర్పడుతాయని తెలిపారు. పెద్దఎత్తున పెట్టుబడి పెడుతున్న హ్యుందయ్ మోబిస్‌కు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ కంపెనీకి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దీనిస్ఫూర్తితో అనేక కంపెనీలు కొల్లూరులోని ఆటోమోటివ్ మొబిలిటీ క్లస్టర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు.