కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపుడుతున్న వివిధ వయస్సులకు చెందిన తెలంగాణ ప్రజలకు కంటి వెలుగును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కంటి పరీక్షలు, కంటి అద్దాలు, అవసరమైన వారికి జరిపే కంటి శస్త్ర చికిత్సలు, మందులు తదితరాలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తి ఉచితంగా అందజేయనుంది. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను కూడా కంటి వెలుగు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా కల్పించనున్నారు.
ఇక ఈరోజు సీఎం కేసీఆర్ తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామం నుంచి కంటి వెలుగు పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ..రాష్ట్రానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని మల్కాపూర్ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వృద్దులకు కంటి పరీక్షలు చాలా అవసరమని సూచించారు. కంటి వెలుగు ద్వారా 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తం. ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తమని సీఎం తెలిపారు. ఇప్పటికే 40 లక్షల కళ్లద్దాలు తెప్పించాం. ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 825 టీమ్‌లు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
మల్కాపూర్ నుంచి నేను ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మల్కాపూర్‌కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆడ, మగ అంతరాలు కేవలం మన దేశంలోనే ఉన్నయి. అవకాశాలిస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, కేశవరావు, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.