అమాయకులను బరిడీ కొట్టించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. చిట్టీల పేరుతో లూటీ,అప్పు తీసుకొని ఎగ్గొట్టడం,తప్పుడు సమాచారంతో లోన్లు తీసుకోవడం, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేయడం ఇప్పటివరకు మనం విన్నాం. ఇంకాస్తా టెక్నాలజీ పెరిగింది కాబట్టి చైన్ సిస్టమ్తో డబ్బు సంపాదించడం,ఇంట్లో నుంచే ఉద్యోగం,ఆన్ లైన్ లోన్లు అంటూ ఎదుటి వారి బలహీనతలను బట్టి డబ్బులు దండుకుంటున్నారు కొందరు ప్రబుద్దులు.
అయితే, మోసానికి పాటుపడే కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎంతమంది హెచ్చరించినా ప్రజల్లో మాత్రం అవగాహన రావడం లేదు. దీనికి తాజా ఉదహరనే హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన ఈ సంఘటన. కరక్కాయ పోడి వ్యాపారం పేరుతో జనాల నెత్తిన కుచ్చుటోపి పెట్టి ఏకంగా 5 కోట్లతో ఉడాయించాడో ప్రబుద్దుడు.
కిలో కరక్కాయలు వంద రూపాయలని, అదే కిలో కరక్కాయల పొడి తీసుకుంటే 150 రూపాయలని, కానీ, వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయలు ఇస్తామన్నారని, వాటిని పొడి చేసి ఆ పొడిని జాగ్రత్తగా తీసుకొస్తే డిపాజిట్ చేసిన సొమ్ముకు అదనంగా 300 కలిపి మొత్తం 1300 ఇస్తామని ఆశ చూపాడు. దీంతో పెద్ద ఎత్తున వరంగల్,తూర్పుగోదావరి,హైదరాబాద్ జిల్లాలకు చెందిన వారు పెట్టుబడులు పెట్టారు.
కొంతమందికి రసీదులు కూడా ఇచ్చాడు. కానీ తిరిగి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేయడం,సంగారెడ్డి జిల్లాకు చెందిన గిరుకుల బస్వరాజ్ అనే వ్యక్తికి దాదాపుగా రూ. 40 లక్షలు బాకీ పడటం,సంస్థ యజమాని మల్లికార్జున్ ఫోన్ స్వీచాఫ్ చేయడం,పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బయటపడింది.
అయితే, ఈ కేసులో మరో ట్వీస్ట్ ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేసిన మహిళలు తాము బాధితులమేనని చెప్పడం కొసమెరుపు. మొత్తంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరక్కాయ స్కాం చర్చనీయాంశంగా మారింది.