ప్రపంచ కబడ్డీలో ఇండియాకు తిరుగులేదని మరోసారి రుజువైంది. అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి హోరాహోరీగా సాగిన తుది పోరులో భారత్ 38-29తో ఇరాన్‌పై ఘనవిజయం సాధించింది. ఇంతకుముందు 2004, 2007ల్లో జరిగిన తొలి రెండు ప్రపంచకప్పుల్లోనూ భారతే విజేత. అప్పుడు, ఇప్పుడూ ఫైనల్లో భారత్.. ఇరాన్‌పైనే విజయం సాధించడం విశేషం.
ఇరాన్ వైపు పోతున్న ఆట ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది. నిమిషాల గ్యాప్‌లోనే ఇండియా ఇరాన్ను అదిగమించింది. 24 నిమిషాల వద్ద ఇరాన్ 19-14 పాయింట్లతో ఆధిక్యంలో ఉండగా.. 32 నిమిషాలకి వచ్చేసరికి ఇండియా 26-21 పాయింట్లతో ఇరాన్‌పై ఆధిక్యం సాధించింది.
14వ నిమిషంలో మైదానం వీడిన అజయ్ ఠాకూర్.. ద్వితీయార్ధంలో సబ్‌స్టిట్యూట్‌గా పునరాగమనం చేశాక మ్యాచ్ మలుపు తిరిగింది. అతను 25వ నిమిషంలో రైడ్‌కు వెళ్లి రెండు పాయింట్లు సాధించడంతో ఒక్కసారిగా భారత జట్టులో ఉత్సాహం వచ్చింది. ఇక అప్పటి నుండి ఇండియా ఇరాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 38-29 పాయింట్లతో మట్టికరిపించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
భారత్ ప్రపంచకప్ సాధించడంలో జట్టు సమష్టి కృషి ఉంది. ఐతే ఈ విజయంలో ఎక్కువ పాత్ర మాత్రం అజయ్ ఠాకూర్‌దే. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ కనీసం పది పాయింట్లతో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన అజయ్.. తుది పోరులో ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. ప్రథమార్ధంలో ఐదు పాయింట్లు వెనుకబడి భారత్ ఒత్తిడిలో పడిపోయిన దశలో అతను సాధించిన రెండు పాయింట్లే మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. ఆ తర్వాత కూడా అజయ్ అదే దూకుడు కొనసాగించాడు. భారత్‌ను గెలుపు బాటలో నడిపించాడు.