సీఎం కేసీఆర్ ఈ నెల 29న జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేయడంతో పాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించనున్నారు. అనంతం ఏర్పాటుచేసే బహిరంగసభలో మాట్లాడనున్నారు.
గట్టు ప్రాంత సమస్యకు పరిష్కారం చూపుతానని తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గట్టు, ధరూర్ మండలాల్లోని 25 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 3 వేల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 28,000 ఎకరాలకు సాగునీరందించేలా డిజైన్ చేశారు.
రూ.553.98 కోట్లతో పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది ప్రభుత్వం. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం స్టేజ్-2 లోని రేలంపాడు రిజర్వాయర్ నుంచి పెంచికల్‌పహాడ్ రిజర్వాయర్‌కు సుమారు 2.80 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తారు. గట్టు మండలం ఆలూరు గ్రామం వద్ద పంప్‌హౌజ్‌ను నిర్మించనున్నారు.
పెంచికల్‌పహాడ్ వద్ద 0.7 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ 17 కి.మీ. పొడవుతో 18.5 వేల ఎకరాలు, ఎడమ కాల్వ 13.8 కి.మీ. పొడవుతో 9.5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.