జేఈఈ అడ్వాన్సుడ్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా..

246
JEE Advanced Result
- Advertisement -

ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్-2018 పరీక్షలో తెలుగు విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఎస్టీ కేటగిరీలో అగ్రస్థానం దక్కింది. తొలి వంద ర్యాంకుల్లో సుమారు పాతిక మందికి పైగా విద్యార్థులు ఏపీ, తెలంగాణ నుంచే ఉన్నట్లు తెలుస్తోంది. ర్యాంకులను ఈ రోజు ఉదయం 10 గంటలకు ఐఐటీ కాన్పూర్ విడుదల చేసింది.

అడ్వాన్స్‌డ్‌లో 18,138 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా మే 20న అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించగా మొత్తం 1,55,158 మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 11,279 సీట్లు మాత్రమే ఉన్నాయి. కటాఫ్‌ మార్కులు సాధించిన వారు ఈనెల 15 నుంచి జరిగే జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

JEE Advanced Result

పంచకులకు చెందిన ప్రణవ్ గోయల్(337 మార్కులు)కు మొదటి ర్యాంకు వచ్చింది. విజయవాడ విద్యార్థి శివకృష్ణ మనోహర్‌కు ఐదో ర్యాంకు. ఓబీసీ కేటగిరీలో మనోహర్‌కు మొదటి ర్యాంకు దక్కడం విశేషం. విశాఖకు చెందిన హేమంత్ కుమార్‌కు ఏడో ర్యాంకు వచ్చింది. ఎస్టీ కేటగిరిలో హైదరాబాద్ విద్యార్థి జె.శివతరణ్ మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. బాలికల విభాగంలో మీనల్ పరఖ్ టాపర్‌గా నిలిచింది. ఓపెన్ కేటగిరీలో ఆమెకు ఆరో ర్యాంకు వచ్చింది. ఎస్సీ విభాగంలో ఆయుష్ కడమ్‌కు మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నారు.

గతేడాది సుమారు యాభై వేల మంది అర్హత సాధించగా.. ఈసారి భారీగా తగ్గింది. ఓపెన్ కేటగిరీలో 126 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. ఓబీసీలో 114, ఎస్సీ, ఎస్టీలకు 63 మార్కులు అర్హతగా నిర్ణయించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఈనెల 15 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కానుంది.

- Advertisement -