మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు స్వీర్గియ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన సమాధికి నందమూరి కుటుంబసభ్యులు, పలువురు నేతలు నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు టీటీడీపీ సీనియర్ నేత, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను గవర్నర్ చేస్తానని, రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు నన్ను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను అండగా ఉండి నడిపించానని..అలాంటిది ఇప్పడు పార్టీలో ఎలాంటి కార్యక్రమం జరిగినా నాకు ఆహ్వానం కూడా పంపియడం లేదన్నారు. మహానాడు కార్యక్రమానికి కూడా తనకు ఆహ్వానం పంపియక పోవడం చాలా బాధించిందన్నారు. నా రాజకీయ గురువు అయినంటువంటి ఎన్టీఆర్ స్దాపించిన టీడీపీ నుంచి నన్ను దూరం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. ఈసందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్టీఆర్ ఆశిర్వాదం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. ఎన్టీఆర్ వర్ధంతికి కానీ, జయంతికి కానీ చంద్రబాబు ఎప్పుడైనా ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించారా అని మెత్కుపల్లి ప్రశ్నించారు.
అంతేకాకుండా టీడీపీ బాగుండాలంటే ఆపార్టీ బాధ్యతల నుంచి చంద్రబాబును తప్పించి నందమూరి వారసులకు ఆ పదవి అప్పగించాలన్నారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా కలిసి కూర్చొని మాట్లాడాలని… తామంతా ఏపీకి వచ్చి టీడీపీ తరపున ప్రచారం చేస్తామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్టీఆర్ శిష్యుడేనని గుర్తుచేశారు. కేసీఆర్ కు చంద్రబాబు మోసం చేశాడుకాబట్టే ఆరోజే పార్టీ నుంచి బయటకు వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో కీలక నేతలందరిని ఎన్టీఆర్ తయారు చేసిన వారే అన్నారు.