భారత టెలీకాం రంగంలో రిలయన్స్ జియో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. భారత కుబేరుడు ముఖేశ్ అంబానీకి చెందిన ఈ కంపెనీ అనతి కాలంలోనే రికార్డు స్థాయిలో వినియోగదారులను సొంతం చేసుకుంది. దీనికి కారణం సరికొత్త వివోఎల్టీఈ టెక్నాలజీ, అపరిమిత సేవలు. జియోకు ఓ సందర్భం ఉంటే చాలు రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. రిలయన్స్ జియో తన చందాదార్లకు మరో ఆఫర్ ఇచ్చింది.
ఇప్పటికే 186 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, 150 మిలియన్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో భారతీయ టెలికాం రంగంలో జియో అగ్రస్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. తాజాగా జియో ఇంటరాక్ట్ సేవలతో దేశంలోని మూవీ ప్రమోషన్ సేవలపై దృష్టిపెట్టింది. త్వరలో వీడియో కాల్ సెంటర్లు, వీడియో కేటలాగ్, వర్చువల్ షో రూమ్‌లు ప్రవేశ పెట్టనున్నట్టు కంపెనీ వెల్లడించింది. జియో ఇంటరాక్ట్‌లో తొలి లైవ్ వీడియో కాలింగ్ అమితాబ్ బచ్చన్‌తో ప్రారంభం కానున్నట్టు తెలిపింది.
జియో కస్టమర్లు ఈ నెల 4న అమితాబ్ బచ్చన్‌తో వీడియో కాల్ మాట్లాడిన అనుభూతి పొందవచ్చునని పేర్కొంది. దీనికి కస్టమర్లు చేయాల్సిందల్లా ‘మై జియో అప్లికేషన్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత జియో ఇంటరాక్ట్‌పై క్లిక్ చేసి స్టార్ వీడియో కాల్‌పై ట్యాప్ చేస్తే సరిపోతుంది. అమితాబ్ కామెడీ షో 102 నాటౌట్‌పై ప్రశ్నలు కూడా అడగవచ్చునని జియో ప్రతినిధి వెల్లడించారు.