రోడ్డు సేఫ్టీపై తెలంగాన కేబినెట్ సమ్ కమిటీ భేటీ అయింది. మాదాపూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్,తుమ్మల నాగేశ్వరరావు,మహేందర్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. రహదారి భద్రతా అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
రహదారి భద్రత చర్యలను పరిశీలించేందుకు కేరళ వెళ్లిన బృందం రిపోర్టును మంత్రులకు అందజేసింది. కేరళ ప్రభుత్వం రహదారి భద్రతకు తీసుకున్న చర్యలను వివరించింది. అంతేగాదు రహదారి భద్రత చట్టాన్ని అమలు చేయడమే కాదు,వాహన చోదనకు సిములేటర్స్ ను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. విధిగా రోడ్ సేఫ్టీ ఫండ్‌ని కేరళ ప్రభుత్వం ఏర్పాటుచేసిందని తెలిపారు.
ప్రమాదాలు జరుగుతున్న బ్లాకు స్పాట్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టేవిధం గా ప్రణాళికలు ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు. పాఠశాల విద్యార్థులకు విధిగా రహదారి భద్రత, పాటించాల్సిన నియమాలను పాఠ్యాంశంగా భోదించే విధంగా చర్యలు ఉండాలని కోరారు. రోడ్డు ప్రమాదాల వలన ఏటా 7000 మరణాలు సంభవిస్తున్నాయని, ఇది ఎంతో బాధాకరమన్నారు.
ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా అంశాలలో మన రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నదని అయితే ప్రపంచ సగటుతో పోలిస్తే మనం వెనుకబడి ఉన్నామని, ప్రమాదాల నివారణ విషయంలో మన రాష్ట్రం ఇంకా మెరుగైన స్థితికి చేరుకునేందుకు తీసుకోవలసిన చర్యలను అన్ని వర్గాలతో విపులంగా చర్చించి ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.