తెలంగాణ ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధనలో వారు చేసిన నిస్వార్థ సేవకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. సీఎం కేసీఆర్ మడమతిప్పని పోరాటంలో కలిసి నడిచిన ఉద్యమకారులు..తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురు సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్, బండ ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్ నేడు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యసభలో అడుగుపెట్టారు.
ఉదయం 11 గంటలకు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ముగ్గురు కూడా తెలుగులో ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. ఈ ప్రమాణ స్వీకార కార్య క్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు, కులసంఘాల నాయకులు పలువురు హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులతో ఢిల్లీలోని తెలంగాణభవన్ సందడిగా మారింది.
జోగినిపల్లి సంతోష్‌కుమార్ (సంతన్న).. టీఆర్‌ఎస్ ఆవిర్భావం కంటే ముందు నుంచే కేసీఆర్ వెంట నడిచారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలుకరిస్తూ కనిపించే సంతోష్‌కుమార్‌ను అంతా సంతన్న.. అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఉద్యమకాలంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతనూ విజయవంతంగా పూర్తిచేశారు. ఉద్యమనేతగా కేసీఆర్ కరీంనగర్ నుంచి ఆమరణ దీక్షకు బయలుదేరుతున్న సమయంలో ఆనాటి పాలకులు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించినప్పుడు.. అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించేవరకు సంతోష్‌కుమార్ అధినేత వెన్నంటే ఉన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచీ సీఎం కేసీఆర్‌కు చేదోడువాదోడుగా ఉన్న సంతోష్‌కుమార్.. ఇప్పటివరకు ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేస్తున్నారు.
ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అధినేత వ్యక్తిగత విషయాలతోపాటు పార్టీకి, కార్యకర్తలకు, నేతలకు సమన్వయకర్తగా, అందరికీ తలలో నాలుకలా మెదులుతున్నారు. సమస్య ఎంత క్లిష్టమైనా సరే.. ఓపిగ్గా పరిష్కరించి, వినయంగా నిలబడే నిండైన వ్యక్తి. పార్టీలో సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్తల దాకా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకొస్తారు. పార్టీలో వివాదరహితుడిగా తనకంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. మలిదశ ఉద్యమానికి దివిటీగా నిలిచి, తెలంగాణ గుండె చప్పుడు వినిపించిన టీ న్యూస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.