కేంద్రం,రాష్ట్రాల మధ్య ఎన్నో సర్ధుబాట్లు ఉంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసి ఓట్లు సంపాదించుకోవడానికే కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కిషన్ రెడ్డి అవగాహనతో మాట్లాడాలన్నారు.
ద్రవ్య వినిమయం విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా వ్యవహరిస్తుందో మనం అలాగే వ్యవహరిస్తున్నామని చెప్పారు. తెలంగాణ నుంచి కేంద్రానికి 50 వేల కోట్లు పన్ను ద్వారా పోతుంటే కేంద్రం నుంచి మనకు వచ్చేవి కేవలం 24 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. ఈ దేశాన్ని సాకే 7 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు.
ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పు పట్టడమే విపక్షాలకు పనిగా మారిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. డిస్కంల అప్పు రూ.37,500 కోట్లు ఉందనడం సరికాదన్నారు.
హోంగార్డులు,అంగన్ వాడీలకు మంచి జీతాలు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్‌ది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. అర్హులైన దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చి తీరుతామన్నారు. దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. వరంగల్‌ని సింగపూర్ చేస్తామని చెప్పలేదని..కరీంనగర్‌ను లండన్ చేసి తీరుతామన్నారు. సభ్యులు ఏం మాట్లాడిన సభకు హుందాతనం తెచ్చేలా వ్యవహరించాలన్నారు.