ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఐపీఎల్ 2018 సీజన్ షెడ్యూల్ తయారి కీలక మార్పులతో చివరి దశకి చేరుకుంది. టోర్నీ తొలి మ్యాచ్, ఫైనల్ ఆనవాయితీ ప్రకారం గత ఏడాది విజేతగా నిలిచిన జట్టు సొంత మైదానంలోనే జరగనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టోర్నీ మొత్తం మ్యాచ్‌ల టైమింగ్‌లో కూడా కౌన్సిల్ మార్పులు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రాంచైజీలు తమ ఆటగాళ్ల వేలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఇంకా వేలం కూడా ప్రారంభం కాలేదు ఐపీఎల్ 2018 విజేత ఎవరో చెప్పేశాడు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సెహ్వాగ్ కోచ్, మెంటార్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కొత్త జట్టు ఐపీఎల్ విజేతగా ఆవిర్భవిస్తుందని జోస్యం చెప్పేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ మూడు జట్లలో ఏదో ఒక జట్టు విజేతగా నిలవాలని ఆశిస్తున్నానని తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభమై మే 27తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్ల వేలం ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.