తమిళనాడు రాజకీయాల్లో రాణించాలని భావిస్తున్న కమలహాసన్, తన పార్టీపై పూర్తి స్పష్టతను ఇస్తూ, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఫిబ్రవరి 21న ఆయన తన పార్టీ వివరాలను వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా ఈయాత్ర సాగుతుందని అన్నారు. తాను పుట్టిన రామనాథపురం నుంచి యాత్ర మొదలవుతుందని, మధురై, దిండిగల్, శివగంగై జిల్లాల్లో తొలి విడత పాదయాత్ర ఉంటుందని తెలిపారు.
ఈ టూర్‌తో కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం అఫిషియల్‌గా మారుతుంది. దాదాపు ఏడాది నుంచి కమల్ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్త పర్యటన సందర్భంగా తన రాజకీయ పార్టీ పేరును వెల్లడించనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో తెలిపారు. తనపై ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయాలన్న తలంపుతోనే పాలిటిక్స్ లోకి వస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నడుస్తోందని, ప్రజా సంక్షేమ పాలనను తీసుకురావడమే తన లక్ష్యమని కమల్ తెలిపారు. తన యాత్రకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.