బీడు భూములు ప్రాణం పోసుకుంటాయి-కేటీఆర్‌

274
- Advertisement -

గోదావరి జలాలతో తెలంగాణ మెట్ట ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. బీడుపడ్డ భూములు మళ్లీ ప్రాణం పోసుకొంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ పనులు గడువులోగా పూర్తి చేసి రైతుల కళ్లల్లో వెలుగులు చూడాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. తొమ్మిదో ప్యాకేజీ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ గురువారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి ఆకస్మిక పర్యటన జరిపారు.

KTR goes on inspection-spree

తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లివద్ద నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇండ్లు, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ధర్మారం వద్ద నిర్మిస్తున్న భూగర్భ కాల్వను సందర్శించి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తయితే మెట్ట ప్రాంతం సస్యశ్యామలమవుతుందని అన్నారు. ఇంతకాలం నీళ్లు లేక బీళ్లుగా మారిన పొలాలన్నీ పచ్చని చేలతో కళకళలాడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు.

అనంతరం మల్కపేట రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న భూములను పరిశీలించి, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్‌కు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను మంత్రి కేటీఆర్ అభినందించారు. నిర్వాసితులందరికీ న్యాయపరంగా రావాల్సిన పరిహారాన్ని అందజేస్తామని, ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసిత రైతు కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలిస్తామన్న హామీని నిలబెట్టుకుంటామన్నారు. చదువు లేని వారికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

- Advertisement -