సెలెబ్రిటీ క్రికెట్ లీగ్లో డిఫెండింగ్ ఛాంపియన్ తెలుగు వారియర్స్ ఫైనల్లో అదిరిపోయే ప్రదర్శనతో కేరళ స్ట్రైకర్స్ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. సినీతారల క్రికెట్ మ్యాచ్లో తెలుగు వారియర్స్ జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. సోమవారం హైదరాబాద్లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) టీ-10 బ్లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో కేరళ స్ట్రైకర్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ట్రోఫీని సొంతం చేసుకొంది. కెప్టెన్ అఖిల్ అక్కినేని 22 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు బౌండరీలతో 46 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ స్ట్రైకర్స్ జట్టు పది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ జట్టు 7.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగరేసింది. ఫైనల్ మ్యాచ్లో అఖిల్ ఆటే ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి మ్యాచ్కి హాజరై ఆటగాళ్లను, ప్రేక్షకుల్ని అలరించారు. ఇతర జట్ల ఆటగాళ్లు కూడా ఆయనతో సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీపడ్డారు.