సినీ ఇండస్ట్రీలో రోజురోజుకు వేధింపులు ఎక్కువవుతున్నాయి. కొద్దిరోజులుగా యావత్ దేశవ్యాప్తంగా తమను డైరెక్టర్లు, నిర్మాతలు వేధించారని మీడియా ముందుకొచ్చి గళం వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అది కాస్త హాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు కూడా పాకింది. తాజాగా హైదరాబాద్‌లో సినీ దర్శకుడు యోగి తన పట్ల అభ్యంతరకరంగా ప్రవరించాడని షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఫేస్‌బుక్‌లో పరిచయమైన యోగికి తాను డబ్బులిచ్చానని, ఇప్పుడు ఆ డబ్బులు అడిగితే ఇవ్వకపోగా అసభ్యంగా తిడుతున్నాడని, శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అయితే పోలీసుల ఎదుట కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.