నాగపూర్ టెస్ట్‌లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం సాధించింది. రెండోరోజు నుంచి లంకపై పైచేయి సాధించిన భారత్…నాలుగోరోజే లంకను తిప్పేసింది. మూడో రోజూ ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసిన లంక నాలుగోరోజు 166 పరుగులకే కుప్పకూలింది.
భారత్ బౌలింగ్ ధాటికి లంక బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. దీంతో లంచ్ తర్వాత కాసేపటికే శ్రీలంక చాపచుట్టేసింది.ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ స్కోరుతో టీమిండియా ఘన విజయం సాధించింది. టెస్టుల్లో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
భారతబౌలర్లలో అశ్విన్ 4, ఇషాంత్, జడేజా, ఉమేష్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. చివరి వికెట్ తీసి టీమిండియాను గెలిపించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 300 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో 3 టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లి సేన 1-0 లీడ్‌లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులు చేయగా.. భారత్ 6 వికెట్లకు 610 పరుగుల భారీ స్కోరు దగ్గర డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. కోహ్లి (213) డబుల్ సెంచరీ చేయగా.. విజయ్, పుజారా, రోహిత్ సెంచరీలు చేశారు.