మెగాస్టార్…కాలం మారినా క్రేజ్ తగ్గని పేరు… ఆయన స్టెప్ వేస్తే చాలు సిల్వర్ స్ర్కీన్ అదిరిపోద్ది. ఆ స్మైల్ కు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇక డైలాగ్స్ కు అయితే విజిల్స్ పడాల్సిందే. టోటల్ గా చిరు పేరు వింటేనే మెగా అభిమానులు పూనకంతో ఊగిపోతారు. సినీ అభిమానులు సైతం చిరు బొమ్మను చూడటానికి బార్లు తీరుతారు. తెలుగులో 150 సినిమాల్లో నటించి, అగ్ర కథానాయికలతో ఆడిపాడిన చిరంజీవి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారు. తెలుగులో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ ప్రేమ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.
కాలేజీ రోజుల్లో కలిగేదాన్ని ప్రేమ అనలేం కాని, ఆకర్షణ అనవచ్చని అన్నారు. తాను ఒంగోలులోని శర్మ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్నప్పుడు బోటనీకి లేడీ లెక్చరర్ ఉండేవారని, ఆమె అంటే తనకు ఒక రకమైన ఆకర్షణ ఉండేదని చెప్పారు. ఆమె పాఠాలు చెప్పే తీరుతోనే తనకు బోటనీపై ఎంతో మక్కువ పెరిగిందని అన్నారు. ప్రాక్టికల్స్ సమయంలో బ్లేడ్ తీసుకుని లీఫ్ కట్ చేసే సమయంలో ఆమె దగ్గరగా వచ్చి చెప్పేవారని, ప్రాక్టికల్స్ ఎంత బాగా చేస్తే మేడమ్ అంత దగ్గరగా వస్తారని భావించే వాడినని చెప్పారు. ఆమె చేత శభాష్ అనిపించుకోవాలని కోరుకునేవాడినని అన్నారు. ఇప్పుడు ఆమె పేరు కూడా గుర్తు లేదని… ఆమె ఫేస్ కూడా గుర్తు లేదని… అన్నీ మర్చిపోయానని చెప్పారు.
ఇంటర్ తర్వాత నర్సాపురంలో బీకాంలో చేరానని… అక్కడున్నవారు తనకు ఫ్రెండ్స్ అయ్యేలోపలే ఫస్ట్ ఇయర్ అయిపోయిందని… ఆ తర్వాత తన ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల ఎవరితోనూ కలవలేకపోయానని తెలిపారు. ఇంతకు మించి ప్రేమ వ్యవహారాలు, లవ్ లెటర్లు ఇలాంటివేమీ తన జీవితంలో లేవని తెలిపారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చిరంజీవి పంచుకున్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్లపై కూడా దృష్టి ఉండేది కాదని… దర్శకులు, నిర్మాతలతో మంచి నటుడు అనిపించుకోవాలనే తపన మాత్రమే ఉండేదని చెప్పారు. ఆ తర్వాత పెళ్లయిపోయిందని తెలిపారు. తన జీవితంలో తన సతీమణి సురేఖ తప్ప ఇంకెవరూ లేరని చిరంజీవి అన్నారు.