జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రం ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ఆదర్శ గృహిణి అన్నది ఉపశీర్షిక. సిరిపురపు విజయభాస్కర్ సమర్పణలో జి.విజయకుమార్ గౌడ్ నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర కోసం నటి వాణీ విశ్వనాధ్‌ని దర్శకుడు సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వాణీ విశ్వనాధ్ కూడా ఈ వార్తలు నిజమే అని తెలిపింది. ఆ పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆమె తెలిపింది. కానీ లక్ష్మీపార్వతి పాత్ర కోసం దర్శకుడు కేతిరెడ్డి ఓ యంగ్ హీరోయిన్‌ని తీసుకోబోతున్నాడనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి.
‘కాటమరాయుడు’, ‘ఖైదీ నంబరు 150’ సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో చిందేసిన రాయ్‌లక్ష్మిని లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రాయ్ లక్ష్మీ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకుంది. ఈమె స్ధానంలో పూజా కుమార్‌ని ఎంపికచేసినట్లు దర్శకుడు కేతిరెడ్డి తెలిపారు.
ఈ విషయాన్ని కేతిరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ధ్రువీకరిస్తూ, ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్తను తన టైమ్ లైన్ లో షేర్ చేసుకున్నారు. వీరగంధం సుబ్బారావు సతీమణిగా ఉన్న లక్ష్మీ పార్వతి దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందన్న విషయమై తాను సినిమా తీయనున్నట్టు ఇప్పటికే కేతిరెడ్డి స్పష్టం చేశారు.