వైవిధ్యమైన కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు మనోజ్. పాత్రకోసం ఎంతటి సాహసమైన చేసే మనోజ్ పలు చిత్రాల్లో డూప్ లేకుండా ఫైట్స్ కూడా చేశారు. తాజాగా మనోజ్ ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన చిత్రం ఒక్కడు మిగిలాడు. 1990ల్లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఎల్‌టీటీఈ నేత ప్రభాకరణ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..?కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన మనోజ్ ఈ సినిమాతో ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..
కథ:
తన ప్రమోషన్ కోసం ఓ కాలేజ్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్ (మిలింద్ గునాజీ) కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. విషయం తెలుసుకున్న అమ్మాయిలు వేరే దారిలేకపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. కానీ నిజం తెలుసుకున్న సూర్య(మంచు మనోజ్) విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తాడు. కానీ మినిస్టర్ తన బలాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అణచివేసి సూర్యపై గంజాయి స్మగ్లర్ ముద్రవేసి అరెస్టు చేయిస్తారు. ఈ నేపథ్యంలో సూర్య పోలీసుల చెర నుంచి బయటపడ్డాడా? లేదా? అమ్మాయిలపై జరిగిన అరాచకానికి బదులు తీర్చుకున్నాడా? సూర్యకీ, శ్రీలంకలో ఉన్న పీటర్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేదే..‘ఒక్కడు మిగిలాడు’ కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,మనోజ్ నటన,మాటలు. మంచు మనోజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు. ముఖ్యంగా పీటర్ పాత్రలో మనోజ్ జీవించాడు. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుంది. కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్ ఆండ్రోస్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల‍్లో అజయ్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణమురళీ మరోసారి తన మార్క్ చూపించాడు. సుహాసిని, మిలింద్ గునాజీ, బెనర్జీ తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రన్ టైం,సీరియస్‌గా సాగే కథనం. హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదు. దర్శకుడు చెప్పాలనుకున్న విషయం మంచిదే. కానీ, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నించడంతో కాస్త ఇబ్బంది ఏర్పడింది. సెకండాఫ్‌లో పడవప్రయాణం సన్నివేశాలు సహనాన్ని పరీక్షిస్తాయి. రెండు, మూడు నిమిషాల్లో చెప్పాల్సిన సన్నివేశాలను సుదీర్ఘంగా మలచడంతో అక్కడే సినిమా కాస్త పట్టు తప్పినట్లు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సినిమాకు సాంకేతికంగా మంచిమార్కులే పడతాయి. నేపథ్యం సంగీతం బాగుంది. అక్కడక్కడ వినిపించిన బిట్ సాంగ్స్ సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యాయి. ఇక సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
శ్రీలంకలో శరణార్థుల సమస్యల నేపథ్యంగా తెరకెక్కిన సినిమా ఒక్కడు మిగిలాడు. మనోజ్ నటన,కథ,మాటలు సినిమాకు ప్లస్ పాయింట్ కాగా సీరియస్‌గా సాగే కథనం, రన్ టైం సినిమాకు మైనస్ పాయింట్స్ . మొత్తంగా శరణార్థుల కన్నీటిగాథను కళ్ళకు కట్టినట్లు చూపించిన మనోజ్-అండ్రూస్ మూవీ ఒక్కడు మిగిలాడు.
విడుదల తేదీ:10/11/2017
రేటింగ్: 2.5/5
నటీనటులు: మంచు మనోజ్,అనీషా ఆంబ్రోస్
సంగీతం: శివ ఆర్ నందిగాం
నిర్మాత: ఎస్‌ఎన్‌రెడ్డి, లక్ష్మీ కాంత్
దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్