మన దేశంలో సెక్యూలరిజం ఎంత బలంగా ఉందో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్‌మెంట్‌తో తెలుస్తుందన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన సీఎం రాష్ట్రంలోని అర్చకులు, సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అర్చకులు, సిబ్బంది వేతనాలపై పరిశీలిస్తామన్న సీఎం… మసీదుల్లో ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇచ్చే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు సభ్యులతో భేటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొన్ని మసీదుల్లో ఇమామ్, మౌజంలకు గౌరవ వేతనాలు పెంచుతామని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులు అర్ధాకలితో పని చేసేందుకు శ్రీకారం చుట్టాయన్నారు. అర్ధాకలితో ఎవరూ పని చేయొద్దని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్దీకరిస్తామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. శాశ్వత ఉద్యోగాల కోసం ఔట్‌సోర్సింగ్ తీసుకోవడం నిలిపివేస్తున్నామని ప్రకటించారు.
త్వరలోనే హోంగార్డుల సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. వీరిని క్రమబద్దీకరించే క్రమంలో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగ కల్పన విషయంలో రాష్ట్ర ప్రజలకు, నిరుద్యోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం శాసనసభ్యులకు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. అందరికీ ఉద్యోగాలను కల్పించలేదు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉపాధి కల్పన లభించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగ కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కొంతమంది అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే శాసనసభ,మండలి సోమవారానికి వాయిదా పడ్డాయి.