సంచలన సంఘటనలను, నేరస్తుల జీవితాలను సినిమాగా తియ్యడంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ముంబై ఉగ్రవాద దాడులు మొదలు.. రీసెంట్ గావీరప్పన్ బయోపిక్ వరకు వెండితెరపై ఆవిష్కరించి సంచలనం సృష్టించాడు వర్మ.ఇప్పుడు వర్మ కన్ను గ్యాంగ్ స్టర్ నయీమ్ పై పడింది. నయీమ్ చనిపోగానే అతడి జీవితంపై సినిమా చేయనున్నట్లు వర్మ ట్విట్టర్ లో ప్రకటించినప్పటి నుంచి సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈమధ్యనే నయీం పోస్టర్‌ను విడుదల చేసిన వర్మ ఇప్పుడు టైటిల్ సాంగ్‌ను విడుదల చేశాడు. చిన్నపిల్లలు తప్పు చేస్తున్నా సరిదిద్దకుండా గారాబం చేసుకుంటూ పోతే.. చివరకు క్రిమినల్స్ గా మారే ప్రమాదం ఉంటుందంటూ నయీంను ఉదాహరణగా సమాజానికి ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. ఈ మెసేజ్ కు తానే వాయిస్ కూడా ఇచ్చాడు. ఇక అసలు విషయానికొస్తే.. వర్మ ఏ సినిమా మొదలు పెట్టినా.. కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తుంటాడు.
ఇప్పుడు నయీమ్ ను కూడా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నాడు. అంటే అక్టోబర్ లోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఇటీవల వర్మ తన సినిమాలన్నింటికీ దాదాపు తానే కథలు రాసుకుంటున్నాడు. నాయీం స్టోరీ విషయంలో మాత్రం వర్మ తనలోని రచయితను పక్కన పెట్టేశాడు. తెలుగు మీడియా రంగంలో సీనియర్ మోస్ట్ క్రైమ్ జర్నలిస్ట్ అయిన బలివాడ మురళీధర్ నయీమ్ సినిమాకు కథ అందిస్తున్నారు. క్రైమ్ జర్నలిస్ట్ గా ఆయనకు సుధీర్ఘ అనుభవం ఉంది.అందుకే ఈ బాధ్యతను వర్మ, మురళీధర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ గా, ఆ తరువాత గ్యాంగ్ స్టర్ గా.. ఆ తరువాత గ్యాంగ్ స్టర్ గా మారిన నయీం జీవితాన్ని ఒక్క సినిమాలో చెప్పడం కష్టమే. అందుకే వర్మ నయీమ్ బయోపిక్ ను మూడు భాగాలుగా తియ్యాలనుకుంటున్నాడు. ఈ మూడు భాగాలకు మురళీధర్ కథలను ఇవ్వనున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో గ్యాంగ్ స్టర్ నయీం ఒక్కడు మాత్రమే కాదు, అతని వెనకా ఎన్నో రాజకీయ, వ్యాపార రంగ శక్తులున్నాయి.
వర్మ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెతున్నాయనడంలో సందేహంలేదు. మరీ ఈ బయోపిక్ తో ఆ తెరవెనక సూత్రధారులు, పాత్రధారుల పేర్లు బయటకు వస్తాయో, లేదో చూడాలి.