రాష్ట్రపతి మొదటి అంతర్జాతీయ పర్యటనకు బయల్దేరారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆఫ్రికా ఖండంలోని డ్జిబౌతీ, ఇథియోపియా దేశాలకు బయల్దేరారు.
ఈ పర్యటనలో భాగంగా ఆ రెండు దేశాలతో విదేశీ కార్యాలయ కన్సల్టేషన్ పనులతో పాటు కొన్ని ఆర్థిక ఒప్పందాలపై కూడా సంతకాలు చేయనున్నారు.
భారత్‌తో హిందూ మహాసముద్రం వారధిగా సరుకు రవాణా కార్యకలాపాలు సాగించే దేశాల్లో డ్జిబౌతీ ప్రముఖమైనది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ దేశం దాదాపు 284 మిలియన్ డాలర్ల వరకు భారత్‌తో వ్యాపారం కొనసాగించింది. భారత విదేశాంగ విధానంలో హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆఫ్రికా దేశాలు చాలా కీలకమైనవి.
అందుకే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన మొదటి అధికారిక విదేశీ పర్యటన కోసం ఆ దేశాలను ఎంచుకున్నారని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అశోక్ మాలిక్ తెలియజేశారు. డ్జిబౌతీ దేశంలో ఓ సిమెంట్ ప్లాంట్ నిర్మించడానికి భారత్ 49 మిలియన్ డాలర్లను లైన్ ఆఫ్ క్రెడిట్‌గా కేటాయించింది.
ఇక 45 ఏళ్ల తర్వాత ఇథియోపియాను సందర్శించనున్న భారత రాష్ట్రపతిగా కోవింద్ నిలిచారు. చివరిసారిగా 1972లో అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరి ఈ దేశానికి వెళ్లారు. 2016లో ఇథియోపియాతో ద్వైపాక్షికంగా ఒక బిలియన్ డాలర్ల వరకు వ్యాపారం జరిగింది. ఇదిలా ఉండగా..ఇరు దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా రామ్‌నాథ్ కోవింద్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.