రిలయన్స్ జియో మార్కెట్లో జియో ఫీచర్ ఫోన్ ప్రవేశపెట్టిన నాటి నుంచి టెలికాం మార్కెట్లో ఉన్న ఇతర ఆపరేటర్లు కూడా ఫీచర్ ఫోన్ల తయారీ పనిలో పడ్డారు. దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ సరికొత్త ఆఫర్లతో ముందుకువస్తోంది. ఇప్పటికే జియోకు ధీటుగా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించిన ఎయిర్టెల్.. ఇపుడు జియో 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా ఎయిర్టెల్ 4జీ బడ్జెట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ఇపుడు ఈ రేసులో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది.
బీఎస్ఎన్ఎల్ కూడా రూ. 2000కే ఫీచర్ ఫోన్ విడుదల చేసే పనిలో పడ్డట్లు సమాచారం. అంతేకాకుండా దీపావళి పండుగలోగా ఈ ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ఫోన్ తయారీ కోసం మైక్రోమాక్స్, లావా వంటి మొబైల్ తయారీ కంపెనీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ 4జీ సపోర్ట్ చేస్తుందా? లేదా? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఎయిర్టెల్ తీసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్ కోసం ఇప్పటికే పలు మొబైల్ తయారీ సంస్థలతో చర్చలు జరుపింది. ఈ చర్చలు సఫలం కావడంతో దీపావళి నుంచి మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. ఎయిర్టెల్ ప్రవేశపెట్టనున్న 4జీ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా పనిచేయనుంది. ఫోన్‌తో పాటు ఎయిర్టెల్ సిమ్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. దీంతో ఆకర్షణీయమైన డేటా ఆఫర్లను ఇవ్వనున్నట్టు సమాచారం.